Online Puja Services

ఊపిరి పీల్చుకో అయోధ్యా ! రాముడొచ్చేశాడు

3.15.218.254


ఊపిరి పీల్చుకో అయోధ్యా ! రాముడొచ్చేశాడు | Breathe Ayodhya!! Lord Rama is Coming
లక్ష్మీ రమణ 

శ్రీరాముని చరితమును చదివెదమమ్మా .. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా … అని దేశమంతా రామ చరితముని పారాయణ చేయడంలో మునిగిపోయింది. రామ నామము రోమరోమమున నిలుపుకొని ఏకకంఠముతో రామ నామముని పలువరిస్తోంది. దారులన్నీ అయోధ్యకు పయనమవుతున్నాయా అన్నట్టు, దేశమంతా అయోధ్య వైపే పరిగెడుతోంది.  ఒక రాముని కోసం కొన్ని వేలకోట్ల తపనలు , తపస్సులు . ఎందుకంటె, రాముడు నరోత్తముడు. ఆదర్శపురుషుడు. ధీరోదాత్త చరితుడు.  సుగుణాభిసోముడు. 

ఈ దేశంలో తల్లయ్యే ప్రతి పడచూ రాముడిలాంటి బిడ్డ కావాలనుకుంటుంది.  వివాహమాడే ప్రతి వధువూ తనకు రాముడి వంటి వరుడు కావాలనుకుంటుంది.  ప్రతి తండ్రీ తనకి రాముడిలాంటి కొడుకు కావాలనుకుంటాడు. యోగ్యుడైన  గురువు  రాముని వంటి శిష్యుడు లభించాలనుకుంటారు.  ప్రజలు రాముడి వంటి రాజు కావాలనుకుంటారు.  భగవంతుడే నరుడై దిగివచ్చినవాడు రాముడు. అందుకే, వైషమ్యాలన్నింటికీ అతీతంగా  ఈ నర జాతికి  ఆదర్శ పురుషుడు రాముడు. 

 అటువంటి రామ జన్మ భూమి అయోధ్య. అక్కడ ఉండాలినది జగదభిరాముని దివ్య భవ్య మందిరం. నేపాల్ లో జానకీ మాత జన్మస్థలి ఉంది.  అయోధ్యలో రాముని జన్మస్థలంలో బాబ్రీ మసీదు ఉంది.  ధ్వంసమైన ఆలయాలు, తరలిపోయిన ఆలయ సంపదలు, జ్వలించిన హిందువుల హృదయాలు అప్పటి పాలకుల రాచరికపు అరాచకాల మాటున మూగబోయాయి.  కానీ, రాముని కోసం తపన, తరాలు గడిచినా తరిగిపోలేదు.  స్వాతంత్య్ర భారతంలో సైతం న్యాయం కోసం పోరాటం తప్పలేదు.  అయినా వెనుతీయలేదు.    రామజన్మభూమిని దాదాపు 500 సంవత్సరాల తర్వాత సాధించుకోవడం, అక్కడ రామాలయ నిర్మాణం జరుపుకోవడం, ఈ కల సాకారం అవుతున్న కాలంలో మనం సాక్షిగా, ప్రత్యక్షంగా చూడగలగడం జన్మ జన్మల సుకృతం. ఈ మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కావడంలో  ఎందరెందరో సాధుసంతుల కృషి ఉంది.   అసలు ఈ రామాలయం ఆవిష్కృతం అవుతుందా అని బెంగపడ్డ, వేదన చెందిన  మహానుభావుల తపస్సు ఉంది. ఆ సంఘటనలు చరిత మరచిపోలేనివి.  

1992 డిసెంబర్ 6న బలవంతంగా హిందూ బంధువులు, బాబ్రీని  తొలగించే ప్రయత్నం చేశారు.  ఆ తర్వాత ఎన్నో హింసాత్మక, నాటకీయ, రాజకీయ పరిణామాల  తర్వాత, పోరాటాల తర్వాత  నవంబర్ -9, 2019లో సుప్రీం కోర్టు రామమందిరానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఆగస్టు 5- 2020లో రామజన్మ భూమిలో రామాలయానికి శంఖుస్థాపన చేశారు. తీవ్రమైన కరోనా సమయంలోనూ మొక్కమొవోని పట్టుదలతో నిర్మాణపనులు సాగాయి. 2024 జనవరి 22న  బాలరాముడు రామ జన్మభూమిలో కొలువవ్వబోతున్నాడు. 

 చరిత్రలో మహారాజులు కట్టించిన దేవాలయాలు , దివ్య స్ధలాలు అని చదువుకుంటున్నాం. ఆ కళాత్మకతకి, ఆయా దేవాలయాల్లో నిక్షిప్తం చేసిన శిల్ప సంపదకు, వాటి ద్వారా అందజేసిన అనంతమైన విజ్ఞానానికి జోహార్లు సమర్పిస్తున్నాం. కానీ అయోధ్య రామాలయం చరిత్రగా మిగిలిపోయే దివ్య ఘట్టం. చరితని చూసి జయహో అనడం కాదు, చరిత్రగా మిగిలిపోయే శ్రీ రామకార్యాన్ని చూసిన ధన్య జీవులుగా మిగిలినందుకు, అటువంటి విభూతిని ఈశ్వరుడు మనకి అనుగ్రహించినందుకు సంబరపడాల్సిన దివ్య సమయంలో ఉన్నాం మనం. ఊపిరి పీల్చుకో అయోధ్యా ! రాముడొచ్చేశాడు.   

శ్రీరామ జయరామ జయ జయ రామ . 

జై శ్రీరాం . 

 

 

 

Lord Rama, Ayodhya, Rama Mandir, Ramjanmabhoomi, Rama Janmbabhumi, Ayodhya Ram, Janmabhoomi, Janma Bhoomi,Janma, Bhumi,Ram, Jai Sreeram, Jaisriram, 

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore